రాబోయే పండుగల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి మరియు దసరా ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. వినాయక మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితుల విజ్ఞప్తి మేరకు పాఠశాల విద్యా మంత్రి నారా లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లతో చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000 వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. దసరా నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా దేవి పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ వర్తించనుంది. ప్రభుత్వం ఇందుకోసం సుమారు రూ. 25 కోట్లు ఖర్చుచేయనుంది.
ప్రత్యేకంగా ఉత్తర్వులను అధికారులు విడుదల చేయనున్నారు. ఉత్సవాల్లో విద్యుత్ ఖర్చు తగ్గడంతో మండప నిర్వాహకులు మరింత ఉత్సాహంగా, ఆర్థిక భారం లేకుండా సంబరాలు జరుపుకునే వీలు కలుగనుంది. భక్తి మార్గాన్ని, సామూహిక సంస్కృతిని ప్రభుత్వము ఈ నిర్ణయంతో మరింత ప్రోత్సహించడం జరిగింది.